09-11-2020 రాత్రి 10-30
నా కాలిమీద ఎవరో మృదువుగా తట్టి లేపుతున్నారు.
అంతకు ముందు రెండు రోజుల క్రితం తనని హాస్పిటల్ లోఎడ్మిట్ చేశాం. బాగానే ఉంది. మర్నాడు ఇంటికి పంపించేస్తాం అన్నారు డాక్టర్ లు.
కళ్లు తెరిచి చూస్తే ఫణి.
అమ్మకి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గి పోతున్నాయి ట.డాక్టర్ రమ్మంటున్నారు
అన్నాడు ఆందోళన గా.
నాకు అర్థం ఐపోయింది.
నన్ను వదిలి పెట్టి వెళ్లి పోయే సమయం వచ్చేసిందని.
మనస్సు ఏడుస్తోంది కానీ కళ్లు పొడిగానే ఉన్నాయ్.
దీనిని స్థితప్రజ్ఞత అంటారా? కఠిన హృదయం అంటారా?
యాభై ఆరేళ్ల సాహచర్యం అప్పుడే తెగిపోతోందా?
హడావిడిగా బయలుదేరాం.
రూమ్ నిశ్చేతనంగా ఉంది నా మనసు లాగ.
ఇ. సి. జి బలహీనంగా , దీనంగా, అసహాయంగా నన్ను కాపాడు అన్నట్లు..
నేనేం చేయలేని పరిస్థితి.
చివరి సారిగా గుడ్ బై అన్నట్టు..
ఒక తిన్నని సరళ రేఖ.
ఓవర్ అన్నారు డాక్టర్..
అంతా అర్థంఔతోంది మనసు మాత్రం 'ఇది నిజం కాదేమో..కలేమో... మెలుకువ వచ్చాక హాస్పిటల్ కి వెళ్లి చూడాలి"
అని లేని పోని ఆశలు కల్పిస్తోంది..